ఒక ఆలోచన ఆరుగురు కార్టూనిస్టుల మస్తిష్కంలో మధిస్తే ఎలా ఉంటుంది . ఒక అద్భుతమైన కార్టూన్ ఉద్భవిస్తుంది.
ఈ ఆలోచనకి భీజం వేసారు గురుదేవులు .
నేను ఒక రోజు గురుదేవులతో ఒక పోటి నిమిత్తం వేస్తున్న కార్టూన్ గురించి ప్రస్థావిస్తూ ..., కంసుడి చెరసాల నుండి కృష్ణుడిని వసుదేవుడు , ఒక బుట్టలో యమునా నది దాటించే సన్నివేశం వివరిస్తున్నాను , ఆ ఆలోచన
గురువుగారికి నచ్చి ఈ టాపిక్ పైన మనం కార్టూన్ వేద్దాం , వసుదేవుడు కృష్ణుడిని బుట్టలో తీసుకెల్తున్నపుడు
కృష్ణుడి చేతిలో ఏముంటే బాగుంటుందో హాస్యస్పోరకంగా తెలపమన్నారు .
ఇదే ప్రశ్న మరో ఐదుగురు కార్టూనిస్టులని అడిగారు .
a v m గారి ఐడియా ; రాధ తన విసిటింగ్ కార్డ్ కృష్ణుడికి అందిస్తుంది . ఇదొక అద్బుతమైన ఆలోచన , రాధ ఒక కల్పన, ఆవిడ భాగవతంలో, భారతంలో , ఎక్కడా కనిపించని , కవుల,కావ్యకర్తల సృష్టి , ప్రేమదేవత . కృష్ణుడి కన్నా ముందుగానే ఈ సృష్టిలో ఉంది, గోపికా లోలుడు ముందుగా ఆమె పొందాలని విసిటింగ్ కార్డ్ అందిస్తుంది, ఎంత గొప్ప ఆలోచన .
బ్నిం గారి ఐడియా ; ఆధార్ కార్డ్ పట్టుకోవడం . సమయోచితమైన ఆలోచన ఇప్పుడు భారత దేశం మొత్తం ఆధార్ తో అనుసందానించ బడుతోంది , ఇది చూడగానే నవ్వు పుట్టించే ఆలోచన .
చక్రవర్తి గారి ఐడియా ; కృష్ణుడు చంపాలనుకుంటున్న పూతన, శకటాసురుడు, కంసుడు మొదలగు వారి లిస్టు పట్టుకుని ఉంటాడు . కృష్ణుడి ఉద్దేశాన్ని తెలిపే గొప్ప తెలివైన ఆలోచన .
సునీల గారి ఐడియా ; కృష్ణుడి చేతిలో ఆపిల్ ఐపాడ్ , హెడ్ ఫోన్స్ పెట్టుకుని , గేమ్స్ ఆడుతున్నాడు . ఇప్పుడు మన ఇళ్ళల్లో చిన్ని కృష్ణులు ఆడే ఆటలన్నీ వీడియొ గేమ్స్ కదా ......., ఇప్పుడు కృష్ణుడు పుడితే ఆనాడు స్నేహితులతో చేసిన అల్లరి చేయడేమో ? ఎంతటి నిశితమైన పరిశీలనతో కూడిన ఆలోచన .
సాయి కృష్ణ గారి ఐడియా ; వెన్న దొంగ కృష్ణుడు , వెన్న దొరక్క చాకోబార్ తింటున్నాడు , మసకబారుతున్న
పల్లె జీవనం , నవ్వాలి ఆలోచించాలి . చాలా చక్కని ఆలోచన .
గురువులు జయదేవుల ఐడియా ; ఇదొక గొప్ప సందేశాత్మక , ఆలోచనాత్మక , పరిశీలనాత్మక ఐడియా....... భగవత్ గీత చదువుతున్న కృష్ణుడు . ఇంతకన్నా సెల్ఫ్ హెల్ప్ సాహిత్యం ప్రపంచంలో మరెక్కడా లేదు . ఇంతకన్నా పిల్లలకు మార్గ నిర్దేశం చేసే ఆలోచన ఏముంటుంది చెప్పండి .
ఈ కార్టూన్లో బొమ్మలు గురువుగారు వేసినవి, ఆలోచనలు పైన తెలిపిన కార్టూనిస్టులు చేసినవి, ఇక నా అదృష్టం ఏంటంటే కేవలం టాపిక్ చెప్పినంత మాత్రాన గురువుగారు నా పేరును ఈ కార్టూన్లో పొందుపరచి , ఇంత గోప్ప కార్టూన్లో నన్ను భాగస్వామిని చేసారు . గురువుగారికి అనంతకోటి వందనములు .
గురుభ్యోనమః గురుభ్యోనమః గురుభ్యోనమః
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి