29, డిసెంబర్ 2014, సోమవారం

నాలోన గలశివుడు నీలోన గలశివుడు నాటకాలాడగలడు


       

       
          ఎన్నో రోజులుగా మా ఆవిడ కోరుతున్న కోరిక , ఒక్క సారి వేములవాడ దేవస్థానం వెల్లివద్దమండి , చాలా రోజుల క్రితం ఏదో మొక్కుకుందట , అది తీర్చాలట , ఆవిడకి దేవుడిపైన చాలా నమ్మకం , నమ్మకమే కదండీ మనిషిని ముందుకి నడిపిస్తుంది , ప్రతివ్యక్తికి ఏదో ఒక దానిపైన నమ్మకం ఉంటుంది, అది దేవుడా,తాను చేస్తున్న పనా , తన పైన తనకా  ఏదైనా కానియండి , నమ్మకం మాత్రం నిజం . అదే ఈ  సృష్టికి ఆధారం .

        ఇదంతా సోది ఎందుకుగాని అసలువిశయానికి వద్దాం , అది కార్తీక మాసం కావడంచేత శివాలయాలలో విపరీతమైన రద్దీ ఉంటుంది  అంచేత సూర్యోదయానికి ముందే వేములవాడ చేరుకునేలా ప్రయాణమై వెళ్ళాం .

        బస్సుప్రయానం , అక్కడికి చేరుకునే సరికి ఉదయం ఎనిమిది దాటింది , దిగంగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా , ఆలయం పడమటి ద్వారం గుండా దేవస్థానం లోకి ప్రవేశించాం , ప్రవేశిస్తూనే దేవస్థానం వారు ఏర్పాటుచేసిన మైకుల్లో తనికెళ్ళ భరణి గారు రచించి గానం చేసిన శివతత్వాలు వినిపిస్తున్నాయ్ , ఆవెంటనే ఆలయానికి సంబందించిన సూచనలు చేస్తున్నారు.

       ఆలయానికి కుడివైపున ఉన్న " ధర్మగుండం "  {కోనేరు } లో స్నానం చేయడానికి ఉపక్రమించాం , అదే వైపున పెద్ద చెరువు, చాల శుద్దిగా ఉంది నీరు దాంట్లో బోటింగ్ కూడా ఏర్పాటు చేసారు, మైకులో ....... నాలోన గలడు శివుడు నీలోన గలడు శివుడు ..... నాలోన గలశివుడు నీలోన గలశివుడు గంగ తలకేత్తగలడు ................

      భక్తులకు విజ్ఞప్తి ధర్మగుండంలో కొబ్బరికాయలు కొట్టకూడదు , రూపాయి నాణాలు వేయకూడదు , సబ్బులు వాడకూడదు , ఆలయ పారిశుద్యానికి సహకరించండి,    అనౌన్సు మెంటు  వినిపిస్తోంది , నిజమే కదండీ , మనం విచక్షణతో ఉండకపోతే  పారిశుద్యం ఎలా సాధ్యం , అసలు ఇలాంటివన్నీ ఒకరు సూచిస్తేనే మనం చెయాల , పౌరులుగా  పారిశుద్యం పాటించడం మన భాధ్యత కాదా? పోనిలెండి , వారుసూచించిన విధంగా  మేము మా స్నానాలు ముగించుకుని , తడిగుడ్డలతో దర్శనం కోసం లైన్ లో నిలబడటానికి పరుగులు తీస్తున్నాం , రద్దీ చాలా ఎక్కువగా ఉంది , దర్మగుండానికి ఆనుకుని కల్యాణకట్ట , దాన్ని ఆనుకుని కళ్యాణమండపం , దానికి ఎదురుగా బెల్లం అమ్మకాలు సాగుతున్నాయి , కోరికలు తీరిన భక్తులు మొక్కిన మొక్కుబడిని బట్టి బెల్లం తూకం వేయించి ప్రసాదంగా పంచుతుంటారు, బెల్లం పంచుతున్న వారిని తదేకంగా చూస్తున్న నన్ను  'ఎంటండి మీరు దిక్కులు చూస్తూ నిలబడ్డారు , త్వరగా నడవండి ప్రత్యేక దర్శనం టిక్కెట్ తీసుకురండి , ధర్మదర్శనం లైన్ లో నిలబడ్డ మంటే   ఇక ఇంత రద్దీ లో మన దర్శనం ఇవాళ ఐనట్టే , ఊ  త్వరగా నడవండి ...... నన్ను తొందర చేసింది నా శ్రీమతి .

       భక్తుల సౌకర్యమ్ కోసం మూడు క్యూ  లైన్ లు ఏర్పాటుచేశారు . ధర్మదర్శనం , ప్రత్యేక దర్శనం , కోడె మోక్కుల దర్శనం ,  ఈ మూడు వరసలు సమాంతరంగా వెళ్తూ ఆలయ గాలిగోపురం దగ్గర కలుస్తాయి ,
ఇక్కడ కోడె మోక్కులు ప్రత్యేకం, తమకోర్కెలు తీరితే కోడె ను{ఎద్దు } కట్టేస్తాం అని మొక్కుకున్న భక్తులు
ఆలయం వారు ఏర్పాటు చేసిన కోడెలను తీసుకుని గర్బగుడి చుట్టూ ప్రదక్షినగా తీసుకువచ్చి , గర్బ గుడికి ఎదురుగా కట్టేస్తారు, దీనికి గాను కొంత రుసుం కట్టాల్సి ఉంటుంది, ఇది వేములవాడ రాజరాజేశ్వరస్వామికి ప్రత్యేకం.

        రెండు ప్రత్యేక దర్శనం టిక్కెట్ లు తీసుకుని శ్రీమతి నేను వరసలోకి ప్రవేశించాం , హరహర మహాదేవ ..... హరహర మహాదేవ ................ భక్తుల హర్శద్వానాలతో వరసలన్ని హోరెత్తి పోతున్నాయి , హమ్మయ్య లైన్లో నిలబడేదాకా మనసు కుదుట పడలేదు , వరసలన్ని భక్తులతో కిట కిట లాడుతున్నై , మా పక్క వరస కాళిగా ఉంది , అది ధర్మ దర్శనం లైన్ ,  ప్రతి ఒక్కరు తొందరగా దర్శనం చేసుకుందాం అనే తొందరలో డబ్బులు కట్టి లైన్లో  నిలబడ్డవారే , దాంతో ధర్మదర్శనం లైనంతా ఖాళీగా ఉంది ,  మాయావిడకి చూపించాను  అయ్యో ముందే అనుకుంటే ఆ లైన్లోనే వెళ్ళేవాళ్ళం కదండీ అంది నాలిక్కరుచుకుంటూ ...................,

        మైకులో భరణిగారి శివతత్వాలు వినిపిస్తున్నాయ్ ......... నాలోన శివుడు గలడు ........ నీలోన శివుడు గలడు ..................  నాలోన గల శివుడు నీలోన గల శివుడు కొండపైనున్డగలడు  .................. ,     భక్తులకు విజ్ఞప్తి , క్యు లైన్లో ఉన్న వారు సంయమనం పాటించగలరు , తోపులాటలు వద్దు , రద్దీ ఎక్కువగా ఉంది గమనించ ప్రార్థన,
మా పక్క వరసలో ఒక జంట చిన్న పాపను ఎత్తుకుని నించున్నారు , మూడు సంవత్సరాలు వరకు ఉంటాయ్ పాపకు, ఒకటే ఏడుపు , పుట్టు వెంట్రుకలు తీయించి నట్లున్నారు , కోడె మోక్కుల లైన్లో నించున్నారు , పాప ఏడుపు వాళ్లకు ఎం తోచకుండా ఉంది , లైనువిదిచిపొరాదు ,కొత్త గుండుతో ఉన్న పాప ఏడుపు ఆపదు , ఎంత ఊరడించినా వినడంలేదు , వారినిచూసి మాయావిడ విలవిల్లాడి పోయింది , కొంచెంసేపు పాపను తీసుకుని ఆడించినా ఫలితంలేదు .  పాపతండ్రి చిరాకు పడిపోతున్నాడు,  అటు ఇటు గా  గాలిగోపురం దగ్గరిదాకా వచ్చాం , ఇక్కడి నుండి అన్ని లైన్లో వాళ్ళు ఏకమై గర్బగుడి ద్వారంలోకి ప్రవేశిస్తారు .

        ఆలయ గోపురం దాటగానే గర్భగుడికి ఎడమవైపున , హజ్రత్ బాబా సమాది  ద్వజ స్థంబం పక్కనే ఊదు  పొగ పట్టించుకుంటూ , తావీజులు కట్టించు కుంటున్న భక్తులు .......................,  హజ్రత్ బాబా గొప్ప శివ భక్తుదంట , ఆయన జ్ఞాపకార్థం  సమాదిని గర్భగుడి ముందరే ఏర్పాటు చేసారు . ఎంత గొప్ప మత సామరస్యం మనది , జైహో భారత్ .

       దర్శనం త్వరగా అవుతుందిరా మహాదేవా అనుకుంటూనే ఉన్నాం గాని , గంట సేపు , రెండు గంటల సేపు , లైను కదలదె , ఎక్కడివారం అక్కడే ఆగిపోయాం, లైను ఒక్క ఇంచుకూడా కదలడం లేదు . ఏమై ఉంటుందా ............ ,   పక్క లైన్లో పాప ఏడుపు ఆపడంలేదు, లైను కదలడంలేదు , గంటలకొద్దీ నిలబడి కాళ్ళు లాగుతున్నాయ్ , ఓపిక నశిస్తోంది , ఏడుస్తున్న పాప తండ్రికి ఓపిక నశిన్చిందేమో , అక్కడ కాపలాగున్న కానిస్టే బుల్  ని పిలిచి విషయం ఆరా తీసాడు, ఆలయ e.o. ప్రత్యేక పూజలు చేయిస్తున్నదంట , అందుకే ఈ ఆలస్యం .

       "ఏమైనా అంటే అన్నమంటారుగాని  భక్తుల సౌకర్యాలు చూడాల్సిన e.o. గారే భక్తుల అసౌకర్యానికి  కారణమైతే  ఎంటండి దానర్థం , బుద్ది జ్ఞానం ఉండక్కర్లేదా ....... అసలు వాడు మనిషేనా .......... @@@@@@ $$$$$$$ %%%%%%% ######### &&&&&&&  మాటల్లో చేపడానికి వీలుకావడం లేదు అందుకే పై గుర్తులు వాడాను , అంత విపరీతంగా తిట్టాడండి  ఆపాప తండ్రి . తన ఆవేదనంత ఆ తిట్లల్లో వెళ్ళగక్కాడు,  అంతలో అటుగా ఆలయ ప్రదక్షణ చేస్తూ  వస్తున్న e.o. ఈ గొడవ వింటూ అక్కడ ఆగాడు, కాపలాగున్న కానిస్టేబుల్ ని పిలుచుకుని విషయం ఆరాతీస్తున్నాడు ..................... మైకులో .................. నాలోన శివుడు గలడు  ...........................నీలోన శివుడు గలడు ....................నాలోన గల శివుడు నీలోన గలశివుడు   ఒక కంట చూడగలడు .......................  భక్తుల అసౌకర్యానికి చింతిస్తున్నాం ................................................ ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, !!!!!

          మెల్లగా క్యు లైను కదలడం మొదలైంది , ధర్మదర్శనం లైను, ప్రత్యేక దర్శనం లైను రెండు లోపలి వదిలాడు కానిస్టేబుల్ , కోడె మొక్కుల లైను ఆపేసాడు, మేము లోపలి కదులుతున్నాం , ఆ పాప ఏడుపు రెట్టింపు చేసింది , ఆ పాప తండ్రి  కళ్ళల్లో రక్తాలు కనిపిస్తున్నాయ్ , e.o. కి కానిస్టేబుల్ కి మద్య ఏదో సంబాషణ జరిగింది , దాని పర్యావసానమే  కోడె మొక్కుల క్యు లైను ఆగిపోవడం ,    మైకులో ............................................   నాలోన శివుడు గలడు  ..............................  నీలోన శివుడు గలడు ....................  నాలోన గలశివుడు  నీలోన గలశివుడు   నాటకాలాడగలడు ...................................

      పాప ఏడుపు నాకు ఇంకా విన బడుతూనే ఉంది ..................................., ఆ సంగటన నన్ను  లోపలినుండి కేలుకుతూనే ఉంది .....................


కామెంట్‌లు లేవు: